హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు వెడెక్కుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వేడి ముగిసింది. అయితే లోక్‌సభ ఎన్నికలు ప్రకటన త్వరలో వెలువడుతుందన్న సంకేతాలు రావడంతో ఒక్కసారిగా అన్ని పార్టీలలో ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా అధికార, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య సవాల్.. ప్రతి సవాళ్లు నెలకొంది. ఇటీవల చేవేళ్ల జనజాతరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గులాబి దళపతి కేసీఆర్‌కు విసిరిన సవాల్‌పై బీఆర్ఎస్ నేతలు ఒంటికాలుపై లేచి ఆరోపణలకు దిగారు. అయితే కాంగ్రెస్‌పార్టీ నేతలు సహితం తామేమి తక్కువ అన్న చందంగా ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా రాజీ నామా చేసి, మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తా దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ అసెంబ్లీకి రాజీనామా మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ సవాల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించలేదు.
అయితే కాంగ్రెస్ నేతలు పలువురు ఒంటికాలిపై లేచి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. సీఎం ఎందుకు తాను రాజీనామా చేసి నిలబడతా, కేటీఆర్ నిలబడతారా..? అంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ చేశారు. అయితే తాజాగా శుక్రవారం నాడు మంత్రి కోమటిరెడ్డి సైతం కేటీఆర్‌కు సవాల్ విసిరారు. నేను నల్గొండ లో రిజైన్ చేస్తా.. కేటీఆర్ సిరిసిల్ల లో రిజైన్ చేయాలని, నేను సిరిసిల్ల లో పోటీ చేసి గెలుస్తా.. నల్గొండలో కేటీఆర్ గెలువాలని సవాల్ విసిరారు. దీనితో పాటు బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఇక కారు షెడ్డుకే పరిమితమని తెలిపారు. నల్గొండలో కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తా అని కేసీఆర్ ప్రకటన చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. అలాగే తాను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి ప్రకటించారు. కేటీఆర్ కు టెక్నీకల్ నాలెర్జి లేదన్నారు. కేటీఆర్ ఒక చిన్నపిలగాడు.. నా స్థాయి కేటీఆర్ ది కాదన్నారు. కేటీఆర్ కు క్యారెక్టర్ లేదు.. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని డబ్బు చూసి విర్వవీగుతున్నాడని ఆరోపించారు. నాకు క్యారెక్టర్ ఉంది.. నా దగ్గర డబ్బులు లేవన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి 30వేల తో గెలిచాడు..?నేనైతే అలా గెలిస్తే రాజీనామా చేసేవాన్ని అంటూ కోమటిరెడ్డి తనదైనశైలిలో వ్యంగోక్తులు విసిరారు.