పోలీసుల విచారణకు హాజరైన నటి లిషి, సందీప్
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న నటి లిషి, సందీప్‌లు గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఇద్దరి నుంచి రక్తం, వెంట్రుకలు, మూత్రం నమూనాలు సేకరించి డ్రగ్ పరీక్షల నిమిత్తం పంపించారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీ జరిగిందన్న సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ వివేకానంద్‌తో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న లిషి, సందీప్, శ్వేతలు అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఇది కొనసాగుతుండగానే లిషి, సందీప్‌లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఇప్పటికీ పరారీలోనే ఉన్న నీల్, కేదార్‌లకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.