నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అశీష్ సంగ్వాన్..
నిర్మల్ : (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి)ఏప్రిల్ 1: పోలింగ్ విధులు, ఈవీఎం యంత్రాల పని తీరుపై పూర్తి అవగాహన కలిగి వుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని సెన్ థామస్ పాఠశాలలో అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధానంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పి.ఓ, ఎ.పి.ఓ. అధికారుల పాత్ర కీలకమని, పోలింగ్ రోజు నిర్వహించే విధుల పట్ల, ఈవీఎం యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వి.వి. ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని తెలుసుకొని ఉండాలని సూచించారు.
పోలింగ్ సామాగ్రి, ఫారములు, కవర్స్, మెటీరియల్స్, ఇవిఎం యంత్రాలలో క్లోజ్, రిజల్టు, క్లియర్ వ్యవస్థలపై, వీవీప్యాట్ లో 7 సెకన్లలో వచ్చే స్లిప్స్ పై అవగాహన పొందాలని, పోలింగుకు ముందు మాక్ పోల్ నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటింగు గోప్యత నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని, పోలింగ్ స్టేషన్ ప్రాంతం, ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం -7 లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాని ప్రదర్శించాలని, పోలింగ్ సందర్భంలో వచ్చే టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు, టెస్ట్ ఓట్లపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ సూచనల ప్రకారం అన్ని పత్రాలను సీల్ చేయాలని తెలిపారు.
ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అందుకోసం ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫారం-12 D ద్వారా వివరాలు అందించాలని, ఓటు ఉన్ననియోజకవర్గం సంబంధించిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించడంతో పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ బి. శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి శిక్షణ, అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమాలలో జిల్లా విద్యాశాఖ అధికారి, శిక్షణల నోడల్ అధికారి రవిందర్ రెడ్డి, డి ఆర్ ఓ భుజంగ్ రావు, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.