తిమ్మాయిపల్లికి డిజిటల్ భద్రత కవచం

  • సీసీ కెమెరాలను ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
  • గ్రామాల్లో భద్రతకు సాంకేతికతే బలమైన ఆయుధం
  • హరీశ్ రావు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే

ప్రతిపక్షం,నంగునూరు, జూలై 11: గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. గ్రామ ప్రజల సమక్షంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో ప్రతి గ్రామం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భద్రతను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించడంతో పాటు దొంగతనాలు, ఇతర నేరాలను నివారించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు దర్యాప్తుకు సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి అనేది కేవలం మౌలిక వసతుల కల్పనతోనే పరిమితం కాదని, ప్రజల ప్రాణ, ఆస్తులకు భద్రత కల్పించడం కూడా అభివృద్ధిలో అంతర్భాగమేనని అన్నారు. గ్రామస్తులు, యువత, ప్రజాప్రతినిధులు కలిసి గ్రామ భద్రతకు బాధ్యత వహిస్తూ సీసీ కెమెరాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిమ్మాయిపల్లిలో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాలు గ్రామంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రజల్లో భద్రతపై విశ్వాసాన్ని పెంపొందిస్తాయని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News