గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి సురేఖ సమీక్ష.. జాతర పోస్టర్ ఆవిష్కరణ

ప్రతిపక్షం, జూలై 10: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ లౌకిక స్ఫూర్తిని ప్రతిబింబించే మహోత్సవమని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సంప్రదాయం ప్రకారం తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికే సమర్పిస్తారని గుర్తుచేస్తూ, ఈ జాతరకు ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉందన్నారు.

జాతర సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, పార్కింగ్, అత్యవసర సేవలు వంటి అన్ని అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సమన్వయ సమావేశంలో గోల్కొండ బోనాల జాతరకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రతిష్ఠకు తగిన విధంగా విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొని జాతర ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

Spread the love

Related News

Latest News