ప్రతిపక్షం, జూలై 10: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరి చేయడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఎన్యూమరేషన్ ఫారంతో పాటు ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫొటో జతచేయాల్సి ఉండటంతో ప్రజలు ఫొటో స్టూడియోల బాట పడుతున్నారు.
ఒక్కో వ్యక్తి పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీయించుకోవడానికి రూ.100 నుంచి రూ.200 వరకు ఖర్చవుతోందని ఓటర్లు చెబుతున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే ఫొటోలకే సుమారు రూ.800 వరకు వ్యయం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్టూడియోలు అందుబాటులో లేక సమీప పట్టణాలకు వెళ్లాల్సి రావడంతో ప్రయాణ ఖర్చు కూడా అదనంగా భరించాల్సి వస్తోందని అంటున్నారు.
ఫొటో లేకుండా ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించడం లేదని పలుచోట్ల ఓటర్లు చెబుతున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో అదనపు ఖర్చు పెట్టి ఫొటోలు తీయించుకోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, పేద కుటుంబాలకు ఈ వ్యయం భారంగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఫొటో నిబంధనపై సడలింపులు ఇవ్వాలని లేదా ప్రభుత్వమే ఉచితంగా ఫొటో సదుపాయం కల్పించాలని పలువురు ఓటర్లు కోరుతున్నారు. అయితే ఈ అంశంపై సంబంధిత అధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
















