స్టాలిన్‌కు రాహుల్ సందేశం.. ‘విజయం వరకు కలిసి పోరాడదాం’

ప్రతిపక్షం, జూన్ 19: తమిళనాడులో రాజకీయ సమీకరణాలపై చర్చలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేయగా, అందుకు స్పందించిన రాహుల్ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.

స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపిన రాహుల్ గాంధీ, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణలో తమ ఉమ్మడి లక్ష్యాన్ని ప్రస్తావించారు. దేశ సమైక్యత, రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజల హక్కుల రక్షణ కోసం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

“భారతదేశం అనే భావనను, రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలనే ఉమ్మడి సంకల్పమే మనకు మార్గదర్శకం. ఈ లక్ష్య సాధనలో విజయం సాధించే వరకు కలిసి పోరాడదాం” అని రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న తరుణంలో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్, ద్రావిడ మున్నేట్ర కళగం మధ్య ఉన్న రాజకీయ సాన్నిహిత్యాన్ని ఈ సందేశం మరోసారి స్పష్టం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News