[t4b-ticker]

AICC కార్యాలయం దేవాలయం.. సోనియా, రాహుల్ నాకు దేవుళ్లతో సమానం: చిన్నారెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 22: తాను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణలో తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసీసీ, టీపీసీసీ కార్యాలయాలు తనకు దేవాలయాలతో సమానమని పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనేతలను తాను దేవుళ్లతో సమానంగా భావిస్తానని చిన్నారెడ్డి తెలిపారు. తాను పార్టీ అధిష్ఠానాన్ని విమర్శించే ఉద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న అసలైన పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాత్రమే వెల్లడించానని వివరించారు.

తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యవహారశైలితో దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోస్తున్న నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గౌరవం, ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు.

తన వ్యాఖ్యలను పార్టీ వ్యతిరేక చర్యలుగా భావించాల్సిన అవసరం లేదని క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అధిష్ఠానంపై తనకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే కార్యకర్తల సమస్యలను ప్రస్తావించానని తెలిపారు.

Spread the love

Related News

Latest News