ఘోరం: సొంత తల్లే.. తన బిడ్డకు ఆడపిల్ల వద్దని..

ప్రతిపక్షం, జూలై 27, జనగామ: తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడోసారి గర్భం దాల్చిన మహిళకు పుట్టబోయేది ఆడశిశువేనని తెలిసిన తర్వాత గర్భస్రావం చేయించగా, తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం, శ్రావణి, భాస్కర్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల శ్రావణి మూడోసారి గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి శోభ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయించిందని, మరోసారి ఆడశిశువేనని తెలిసిన అనంతరం గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

గర్భస్రావం అనంతరం శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, గర్భస్రావం చట్టవిరుద్ధంగా జరిగిందా? ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

ఆడశిశువుల పట్ల వివక్ష, లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ గర్భస్రావాల వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Spread the love

Related News

Latest News