ప్రతిపక్షం, జూలై 13: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముత్తూట్ ఫిన్‌కార్ప్ శాఖలో ఖాతాదారుల బంగారాన్ని అక్రమంగా వినియోగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంస్థలో పనిచేస్తున్న శాఖ మేనేజర్ ప్రియాంక, వినియోగదారుల ప్రమేయం లేకుండానే వారి బంగారు నగలను మరోచోట అధిక వడ్డీకి తాకట్టు పెట్టి, వచ్చిన నగదును తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో ఉన్న ముత్తూట్ ఫిన్‌కార్ప్ శాఖలో ఈ అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరో ఆర్థిక సంస్థలో తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెల 9న అంతర్గత తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడటంతో బాధిత ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించడంతో మేనేజర్ ప్రియాంకను అరెస్టు చేశారు.
అనంతరం నిందితురాలిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఘటనలో ఎంతమంది ఖాతాదారుల బంగారం అక్రమంగా వినియోగించబడింది, మొత్తం ఎంత మొత్తం దుర్వినియోగమైంది అనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, సంస్థలోని ఇతర లావాదేవీలపైనా అధికారులు విచారణ చేపట్టే అవకాశముందని సమాచారం.



















