ప్రతిపక్షం, జూలై 11: దక్షిణాది గానకోకిల ఎస్. జానకి మరణంతో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆరు దశాబ్దాలకు పైగా తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఆమె సంగీత ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆమె తొలి తెలుగు పాటపై మరోసారి చర్చ మొదలైంది.
ఎస్. జానకి తొలిసారిగా 1957లో విడుదలైన తమిళ చిత్రం **‘విధియిన్ విలయట్టు’**లో ‘ఎన్ ఆసై పాళానదు ఏనో’ అనే పాట ద్వారా సినీ గాయనిగా పరిచయమయ్యారు. ఆ పాటతోనే ఆమె గాన ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.
ఆ తర్వాత తెలుగులో విడుదలైన ‘ఎంఎల్‌ఏ’ చిత్రంలో ‘నీ ఆశ ఆడియాశ’ అనే గీతాన్ని ఆలపిస్తూ టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు ఘంటసాలతో కలిసి ఆలపించారు. తొలి పాటతోనే తన ప్రత్యేక గాత్ర మాధుర్యాన్ని చాటుకున్న జానకి, అనంతరం తెలుగు సినీ సంగీతంలో అగ్రగాయనిగా ఎదిగారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన ఎస్. జానకి భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. భావోద్వేగం, శ్రావ్యత, ఉచ్చారణలో తనదైన ముద్ర వేసిన ఆమె గానం తరతరాల సంగీతాభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
సంగీత ప్రపంచంలో ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించిన ఎస్. జానకి మరణం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటుగా అభిమానులు, సినీ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు.

















