- ప్రజల ఆరోగ్యం, యువత ఉపాధిపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం వీడాలి.
- ఫార్మా కంపెనీల విస్తరణ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యం అవుతున్నాయి .
- ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది .
- స్థానిక కంపెనీల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే కల్పించాలి .
ప్రతి పక్షం చౌటుప్పల్ జులై 11: చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యంపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ ఐతరాజు అబ్బేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఫార్మా కంపెనీల విస్తరణ కారణంగా గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురవుతున్నాయని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆరోపించారు.
కాలుష్య సమస్యపై ప్రజలు పలుమార్లు ఆందోళనలు చేస్తున్నప్పటికీ పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని అబ్బేందర్ విమర్శించారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, స్థానికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
చౌటుప్పల్ ప్రాంతంలోని గాలి నాణ్యత, తాగునీరు, భూగర్భ జలాలు, వ్యవసాయ భూముల పరిస్థితిపై స్వతంత్ర శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి నివేదికలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పరిశ్రమలు స్థానిక వనరులను వినియోగించుకుని లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, స్థానిక నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని అబ్బేందర్ అన్నారు.“మా భూములను ఉపయోగిస్తున్నారు, మా నీటిని వినియోగిస్తున్నారు,మా గాలిని కలుషితం చేస్తున్నారు, కానీ స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
చౌటుప్పల్ ప్రాంతంలోని పరిశ్రమల్లో కనీసం 80 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే కల్పించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉపాధి కల్పించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనాధారం, స్థానిక యువత భవిష్యత్ కంటే ఏ అభివృద్ధి గొప్పది కాదని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇకనైనా స్పందించాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, ఇంచార్జ్ బొట్ట శివ, నియోజకవర్గ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్, ప్రధాన కార్యదర్శి సుక్క బుగ్గ రాములు, నాయకులు కృష్ణ, నాగిళ్ల మారయ్య, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.


















