రేవంత్ హిట్లరే కాదు.. అంత కన్నా ఎక్కువ: కవిత

ప్రతిపక్షం, జూన్ 08: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విద్యా రంగానికి సంబంధించిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న వ్యాఖ్యలు పేదలు, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేవని ఆమె ఆరోపించారు.

సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో కవిత మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్‌ను మించిపోయారని, తాలిబన్ తరహా ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించడం ద్వారా పేదలు, ముఖ్యంగా ఆడపిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

విద్యాశాఖ నిర్వహణ పూర్తిగా గందరగోళంగా మారిందని ఆమె ఆరోపించారు. ఇంటర్మీడియట్ వ్యవస్థపై సీఎం చేసిన ప్రకటనలకు, విద్యాశాఖ చర్యలకు పొంతన లేదని విమర్శించారు. జూనియర్ కళాశాలలు ప్రారంభమైనా ఇప్పటికీ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు అఫిలియేషన్లు మంజూరు కాలేదని పేర్కొన్నారు.

డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలోనూ అయోమయం నెలకొందని కవిత అన్నారు. వివిధ శాఖలు వేర్వేరు కోర్సులను సూచిస్తున్నప్పటికీ విశ్వవిద్యాలయాల నుంచి తగిన అనుమతులు లేవని, అయినా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని విమర్శించారు.

గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి సమీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపించారు. అలాగే ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ఫీజులు చెల్లించే బాధ్యతను మళ్లించేలా జీవో నెం.7 తీసుకువచ్చారని విమర్శించారు.

ఆ జీవో వల్ల ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను అధిక ఫీజులతో దోపిడీ చేసే అవకాశం ఉందని పేర్కొంటూ, వెంటనే జీవో నెం.7ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేసి దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love

Related News

Latest News