ప్రతిపక్షం, జూలై 18: తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌తో డీఎంకే దూరం పెట్టుకున్న నేపథ్యంలో, రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుపై ఆ పార్టీ వైఖరి మారుతుందా అనే చర్చ మొదలైంది.
ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమయంలో డీలిమిటేషన్ ప్రతిపాదనలను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ పార్టీ గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌తో సంబంధాలు తెగిపోవడంతో డీఎంకే కొత్త రాజకీయ వైఖరి అవలంబించనుందనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని డీఎంకే నేతలు చెబుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే సానుకూలంగా ఓటు వేస్తుందా? లేక గతంలో మాదిరిగానే వ్యతిరేకిస్తుందా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బిల్లు పార్లమెంట్‌లోకి వచ్చిన తర్వాత డీఎంకే అధికారికంగా తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది.


















