వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని హామీ

ప్రతిపక్షం, జూలై 12: వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందినట్లు వచ్చిన సమాచారం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తల నేపథ్యంలో వెంటనే అధికారులను అప్రమత్తం చేసిన సీఎం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు.

ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో తెలుగువారు ఉన్నారనే ప్రాథమిక సమాచారం నేపథ్యంలో వారి వివరాలను అత్యవసరంగా సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదనపు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ విషాద ఘటనలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Spread the love

Related News

Latest News