- కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కరవు’
- కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు
- తిమ్మాయిపల్లిలో పెద్దమ్మ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు
ప్రతిపక్షం,నంగునూరు, జూలై 11: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సృష్టించిన “కృత్రిమ కరవు” అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో జరిగిన పెద్దమ్మ దేవాలయ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో గోదావరి నదిలో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రభుత్వం కావాలనే ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ఇది ప్రకృతి సృష్టించిన కరువు కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతాంగంపై పడిన భారమని అన్నారు. కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాలేళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం ఎలాంటి కరువు వచ్చినా రైతులకు సాగునీరు అందించడమేనని పేర్కొన్నారు. వెంటనే మోటార్లు ప్రారంభిస్తే రంగనాయకసాగర్ నిండి, సిద్దిపేట నియోజకవర్గంలోని సుమారు 70 నుంచి 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.
కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదన్న కాంగ్రెస్ ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దానికి తిమ్మాయిపల్లి గ్రామమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఒకప్పుడు తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో గంటల తరబడి ఎదురు చూసే గ్రామం నేడు కాళేశ్వరం జలాలతో పచ్చని పంటలతో కళకళలాడుతోందని చెప్పారు. ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారిందని హరీశ్ రావు తెలిపారు. సమీపంలోని నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వల్ల రైతులు పండించిన గెలలకు మంచి ధర లభిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 12 నెలల జీతాలు వస్తే, ఆయిల్ పామ్ రైతులకు ప్రతి 20 రోజులకు ఒకసారి చొప్పున ఏడాదికి దాదాపు 15 సార్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని పిలుపునిచ్చారు.
తిమ్మాయిపల్లి గ్రామ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, తమ హయాంలో గ్రామంలో కమ్యూనిటీ భవనాలు నిర్మించడం, అన్ని దేవాలయాలకు అవసరమైన సహకారం అందించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక పరిరక్షణ కోసం తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
చివరగా, రేవంత్ రెడ్డి తన పట్టుదలను వీడి వెంటనే కాలేశ్వరం మోటార్లను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించే నిర్ణయం తీసుకోవాలని, అలాంటి సద్బుద్ధిని పెద్దమ్మ తల్లి ఆయనకు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు.



















