కేంద్రం కోటాతోనే పరిమితం చేయడం రైతు వ్యతిరేక నిర్ణయం.
రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది.
రైతుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం.
బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట.
రైతుబంధు, రైతుబీమాతో రైతుకు భరోసా కల్పించాం.
మాజి డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి.
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జోన్ 20: తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు.శనివారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శేరి.సుభాష్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం 70 లక్షల మంది రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని అన్నారు.బిఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా, ప్రస్తుతం రైతులను సంక్షోభంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతే కేంద్రబిందువుగాపాలన సాగిందని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.రైతుల ఖాతాల్లో నేరుగా లక్ష కోట్లకు పైగా జమ చేసి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. పంటల కొనుగోళ్ల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తోందని ఆరోపించారు.గతంలో కేంద్రం కొనుగోలు చేయని పంటలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.ఇప్పుడు కేంద్రం కోటా మేరకే కొనుగోలు చేస్తామనడం అత్యంత బాధాకరమని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదని చెప్పారు.తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు బట్టి. జగపతి,అకిరెడ్డి.కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి.ఉదయ్ కుమార్,జుబెర్ అహ్మద్, నాయకులు కృష్ణ గౌడ్,లింగారెడ్డి, కిష్టయ్య,భీమరి.కిషోర్,పట్లోరి. రాజు,మోహన్ నాయక్,సాయి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.



















