Trending Now

పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు ఇచ్చాకనే.. ఇచ్చంపల్లి ముచ్చట మాట్లాడండి

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 22: బీజేపీ కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సమ్మక్క బ్యారేజ్, అదనపు టీఎంసీ, సీతారామ ప్రాజెక్టు, వార్దా బ్యారేజ్ లకు అనుమతులు ఇచ్చాకనే.. ఇచ్చంపల్లి ముచ్చట మాట్లాడాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి, కృష్ణ రెండు నదులు నిరంతరం ప్రవహిస్తాయి. నదుల అనుసంధానం ద్వారా పూర్వపు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మళ్లీ నీటి గోస తప్పదని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రాంతానికి గోదావరి నది ఒక కల్పతరువని.. కేంద్రం ఎంఓయూ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం ఎంటన్నారు. గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి.. కోటి ఎకరాలకు సాగు సాగునీళ్లు, త్రాగునీళ్లు ఇక్కడి నుంచే పోతాయని.. గోదావరి నది ప్రజలకు ఆధారమని అన్నారు. ఇచ్చంపల్లి దగ్గర పెద్ద డ్యాం కట్టి నీళ్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ నదుల అనుసంధానం ద్వారా పెద్ద అడవి ప్రాంతం కనుమరుగు కావడంతో పాటు, వ్యవసాయ భూములను కోల్పోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అడుగుతుందని ప్రశ్నించారు.

తెలంగాణ లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి దీనిపై ఏం స్పందించడం లేదన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు సర్వే 1985లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు హయాంలో చేశారని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కార్యాలయం వరంగల్ లో ఉండేదని, అప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వ్యతిరేఖించాయన్నారు. గంగా నది నుంచి మహానదికి ఇంత వరకు సర్వే లేదని, గోదావరి నుంచి కృష్ణ.. కావేరి నదులకు అక్కడి నుంచి తమిళనాడుకు ఎలా తరలిస్తారని దుయ్యబట్టారు. నీటి పంపకాల విషయం తేల్చకుండా ఎలా అనుసంధానం చేస్తారని, గోదావరి బేసిన్ లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు రావాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రైతాంగం ఏళ్ళ కాలంగా సాగునీళ్లు కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాకనే రైతుల బాధలు తొలిగిపోయాయని పేర్కొన్నారు. ఈ నీళ్లు వస్తేనే రైతులకు సాగునీళ్లు వస్తాయని, కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతులకు గోదావరి నీళ్లు మాత్రమే దిక్కన్నారు.

నదుల అనుసంధానంపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. కర్ణాటక, బుందేల్ ఖండ్ లలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇప్పటి వరకు గోదావరి నీళ్లు వాడుకోవడం జరుగుతుందన్నారు. గోదావరి జలాలను తరలిస్తే బ్రతుకులు ఏమవుతాయని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు లు కట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నదుల అనుసంధానం నిలిపివేయాలని, గోదావరి నదిలో నీటి వాటాలు తేల్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవిందర్ రావు, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి. రామకృష్ణ రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు పొన్నం అనీల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News