గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తెలంగాణ.. పెట్టుబడులకు ఆహ్వానం

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 12: తెలంగాణను ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్-2026’లో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు.

సముద్రతీరం లేని రాష్ట్రాల్లో ఎగుమతుల సూచీలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వాణిజ్య, రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.

‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా డ్రై పోర్టులు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థలతో లాజిస్టిక్స్ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

తెలంగాణలో లాజిస్టిక్స్, రవాణా, గిడ్డంగుల రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న శ్రీధర్ బాబు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Spread the love

Related News

Latest News