వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం

ప్రతిపక్షం, జూలై 21: హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. వీఐపీ భక్తులు, దివ్యాంగులు, జోగినిల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో తోపులాట, తొక్కిసలాట జరగలేదన్నారు. జోగినిలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి, వారు తీసుకొచ్చిన పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించామని చెప్పారు. వారిని వీఐపీ గ్యాలరీలో ప్రత్యేకంగా కూర్చోబెట్టినట్లు తెలిపారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్రం సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News