ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ కేబినెట్ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసి, నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరనుంది.
రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని, రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.
ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 20న జిల్లాలవారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించి పరిస్థితులపై నివేదికలు రూపొందించనున్నారు. వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక నివేదిక తయారు చేయాలని రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందాన్ని ఆదేశించింది.
మరోవైపు ధరణి పోర్టల్‌పై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 2020 అక్టోబర్ 29న ధరణి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన భూ రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ, అసైన్డ్, ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు టెండర్ ప్రక్రియ, అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు చేయనున్నారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్‌లో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ హెల్ప్‌లైన్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
అలాగే మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019లో సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీ నిధులను జాతీయ, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణకు కూడా ఆమోదం తెలిపింది.


















