ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి ఉదయం అల్పాహార పథకాన్ని అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు.. వారి ఆరోగ్యం, ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన అల్పాహార పథకం మంచి ఫలితాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆగస్టు నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు, పాలు, ఇతర ఆహార పదార్థాల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి సీతక్క హెచ్చరించారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆహార పదార్థాల నాణ్యతలో లోపాలు గుర్తిస్తే బాధ్యులైన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. చిన్నారులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీతక్క తెలిపారు.

















