ప్రతిపక్షం, జూలై 16: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాతను మార్చాలి” అంటూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. చదువే జీవితాన్ని మార్చే శక్తి అని, విద్య ద్వారానే ఆత్మగౌరవం, కుటుంబ గౌరవం, సమాజంలో గుర్తింపు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థినులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి తొమ్మిది రకాల వస్తువులతో కూడిన తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లు అందజేస్తామని ప్రకటించారు. రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కిట్ల నాణ్యతపై విద్యార్థులు నేరుగా వాట్సాప్ ద్వారా అభిప్రాయాలు తెలియజేసే విధంగా విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థుల సంఖ్య తగ్గిందని గుర్తు చేసిన సీఎం, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ మార్పు ఒక్కరోజులో సాధ్యం కాదని, కానీ ప్రభుత్వ విద్యను దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టే వరకు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఆయన వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలను పూర్తి చేసి ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహాన్ని నింపామని తెలిపారు. 317 జీవో అమలుతో విడిపోయిన కుటుంబాలను మళ్లీ కలిపామని చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 36వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు. అయితే ఇదే సరిపోదని, దేశంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే వరకు నిరంతరం కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపినట్లు, వచ్చే ఏడాది మరో 150 మందిని పంపనున్నట్లు సీఎం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావంతో ఉద్యోగ రంగంలో వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకుని ప్రపంచ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల నుంచే రేపటి డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, పరిపాలనాధికారులు తయారవ్వాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు.




















