ఆదివాసీల స్వయం నిర్ణయాధికారానికి పీసా చట్టమే రక్షణ కవచం: మంత్రి సీతక్క

ప్రతిపక్షం, జూన్ 10: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, గ్రామసభల బలోపేతానికి పీసా చట్టం కీలక సాధనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లో పీసా చట్టం అమలుపై నిర్వహించిన రెండు రోజుల రాష్ట్రస్థాయి కార్యశాలను ప్రారంభించిన ఆమె, ఈ చట్టం ఆదివాసీల స్వాభిమానానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పీసా చట్టం కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, ఆదివాసీల స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడే రక్షణ కవచమని వివరించారు. గ్రామసభలకే సహజ వనరులపై నిర్ణయాధికారం కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామాలే దేశానికి పునాది అని, గ్రామసభలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని ఆమె పేర్కొన్నారు.

పీసా చట్టం అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని సూచించిన మంత్రి, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి సహజ వనరులు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా ప్రాథమిక సదుపాయాల కొరత ఉందని పేర్కొన్న సీతక్క, గ్రామ పంచాయతీలు, గ్రామసభలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీసా అమలు పుస్తకాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలో స్పష్టమైన ఫలితాలు కనిపించాలని ఆకాంక్షించారు.

సర్పంచులు గ్రామాభివృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించాలని సూచించిన మంత్రి, ‘సర్పంచ్ సంవాద్’ కార్యక్రమం ద్వారా వేలాది మంది సర్పంచులను ఒకే వేదికపైకి తీసుకువచ్చామని తెలిపారు. సాంకేతికతను వినియోగించి గ్రామీణ పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ తనకు ప్రత్యేక బాధ్యత అని పేర్కొన్న సీతక్క, ఉన్నవారి కోసం కాదు.. లేని వారి కోసం పనిచేయడమే నిజమైన ప్రజాసేవ అని అన్నారు. పీసా చట్ట స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అమలు చేసినప్పుడే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని, వారి స్వపరిపాలన కల సాకారం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News