నీట్‌ను రద్దు చేసి రాష్ట్రాలకే అధికారాలు ఇవ్వాలి: టీవీకే డిమాండ్

ప్రతిపక్షం, జూలై 22: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనల నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (TVK) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, వైద్య ప్రవేశాల నిర్వహణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని డిమాండ్ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో నీట్ పరీక్ష విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందని, వరుస లీకేజీలు, అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని టీవీకే పేర్కొంది. రాష్ట్రాల విద్యా విధానాలకు అనుగుణంగా ప్రవేశాల నిర్వహణ బాధ్యతను ఆయా రాష్ట్రాలకే ఇవ్వడం సముచితమని అభిప్రాయపడింది.

అలాగే నీట్ లీకేజీ ఘటనపై విద్యార్థులకు మద్దతుగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని టీవీకే తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, విద్యార్థుల సమస్యలను బలప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ విధానంపై సమగ్ర పునర్విమర్శ చేపట్టి, పారదర్శకమైన ప్రవేశ వ్యవస్థను అమలు చేయాలని టీవీకే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Spread the love

Related News

Latest News