[t4b-ticker]

వివక్ష లేని సంక్షేమమే ప్రజా పాలన: సీఎం రేవంత్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06, నకిరేకల్: రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి వర్గానికి ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రధానంగా పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజా పాలన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వివరించారు.

నకిరేకల్‌లో రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నకిరేకల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పలువురు ఎంపీలు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం తెలిపారు. రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వారికి అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2034 నాటికి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత కొందరు ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అయితే సూర్యుడు ఉదయించినంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నిరుద్యోగుల కోసం ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన యువతకు అవకాశాలు కల్పించేందుకు నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పారు. అదే విధంగా కొత్త రేషన్ కార్డుల జారీ, 3.48 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, పంపుసెట్లకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అమలు చేస్తున్నామని వివరించారు.

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పలు కీలక పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో రూ.9.85 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనాన్ని నిర్మించనున్నారు. నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత వసతి పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. మునిపంపుల గ్రామంలో రూ.3.62 కోట్లతో విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 1×5 ఎంవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, 33/11 కేవీ ఉపకేంద్రం, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లు, నియంత్రణ గది నిర్మాణం ఉన్నాయి.

కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో రూ.2.74 కోట్లతో 1×5 ఎంవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో కూడిన 33/11 కేవీ ఉపకేంద్రం, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. నకిరేకల్ మండలంలో రూ.20 కోట్లతో సమీకృత మండల స్థాయి కార్యాలయాల సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అదేవిధంగా రూ.45.60 కోట్లతో పలు రహదారులను అభివృద్ధి చేయనున్నారు. నకిరేకల్–గురజాల రహదారి నుంచి బైరౌనిబండ వరకు, బైరౌనిబండ నుంచి అమ్మనబోలు–రామాంజాపూర్ రహదారి వరకు రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నారు. అమ్మనబోలు–రామాంజాపూర్ రహదారిని విస్తరించి ఆధునీకరించనున్నారు. నకిరేకల్‌లో రూ.1.10 కోట్లతో ఎక్సైజ్ శాఖ భవనాన్ని కూడా నిర్మించనున్నారు.

నకిరేకల్ ప్రాంతంలో వైద్యం, విద్య, విద్యుత్, రహదారులు, పరిపాలనా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News