[t4b-ticker]

చండూరు మండలంలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం

రైతులకు కీలక సూచనలు చేసిన మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్

ప్రతిపక్షం చండూరు, సెప్టెంబర్ 05: చండూరు మండల వ్యాప్తంగా ఉన్న ఎరువుల విక్రయ కేంద్రాల్లో మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.రైతులకు ఎరువులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. ముఖ్యంగా యూరియా అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS (Fertilizer Flying Squad) యాప్ ద్వారా జరుగుతున్న అమ్మకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. యాప్ ద్వారానే యూరియా విక్రయాలు జరపాలని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్కడే ఉన్న రైతులకు FFS యాప్ వినియోగం, దాని ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 7 రకాల సన్న వడ్ల (Fine Varieties) కు బోనస్ పథకానికి సంబంధించి రికార్డులను పరిశీలించారు. సన్న విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించి, ఈ నమోదు ప్రక్రియను వచ్చే నెల 10-09-2026 లోపు 100% పూర్తి చేయాలని డీలర్లకు గడువు విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 7 సన్న వరి విత్తనాలను కొనుగోలు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా తాము కొనుగోలు చేసిన సంబంధిత ఎరువుల షాపునకు వెళ్లి తమ ఆధార్, పట్టాదార్ పాస్ బుక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన నాటి నుండి రైతులకు తెలియజేస్తూనే ఉన్నామని, అయితే ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా నమోదు చేసుకోవాలని మరోసారి సూచించారు.

ఇక ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మండలంలో పత్తి, కంది తదితర పంటలు తీవ్ర నీటి ఎద్దడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బోరుబావులు, ఇతర నీటి వసతి ఉన్న రైతులు వెంటనే తమ పంటలకు ప్రాణ రక్షక తడులు (Life Saving Irrigation) ఇవ్వాలని కోరారు. నీటి వసతి లేని రైతులు పంటలు వాడిపోకుండా 2% యూరియా ద్రావణాన్ని (1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా) పిచికారీ చేసుకోవడం ద్వారా పంటను కాపాడుకోవచ్చని సూచించారు.రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన తెలిపారు.

Spread the love

Related News

Latest News