అలుగునూరులో భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు.. గజమాలతో ఘన సన్మానం
కాన్వాయ్ బయలుదేరే వేళ లారీ తాకడంతో కారు డోర్‌కు స్వల్ప నష్టం
ప్రతిపక్షం, మానకొండూర్, సెప్టెంబర్ 5: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా అలుగునూరులో పార్టీ శ్రేణులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ వెళ్తుండగా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వద్ద భారీగా తరలివచ్చిన మహిళలు ఆయనకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ వాహనం చుట్టూ మహిళలు పెద్ద సంఖ్యలో చేరడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ‘కేటీఆర్ జిందాబాద్’, ‘బీఆర్‌ఎస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం భారీ గజమాలతో కేటీఆర్‌ను సన్మానించారు. మహిళలు వరుసగా రాఖీలు కట్టి కేటీఆర్‌తో ఆత్మీయంగా మమేకమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేటీఆర్ బయలుదేరిన నేపథ్యంలో అలుగునూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
బయలుదేరే వేళ స్వల్ప ప్రమాదం
అలుగునూరు చౌరస్తా వద్ద స్వాగత కార్యక్రమం ముగించుకుని కేటీఆర్ తన కారులో కాన్వాయ్‌తో కరీంనగర్‌కు బయలుదేరుతున్న సమయంలో స్వల్ప ఘటన చోటుచేసుకుంది. కేటీఆర్ వాహనంలోని వెనుక డోర్ తెరిచే క్రమంలో పక్క నుంచి వెళ్తున్న లారీ డోర్‌కు తగిలినట్లు సమాచారం. దీంతో కారు వెనుక డోర్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఆ సమయంలో కేటీఆర్‌కు మహిళలు రాఖీలు కడుతున్నట్లు సమాచారం. ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని, కేటీఆర్ సురక్షితంగానే ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాహనానికి స్వల్ప నష్టం జరగడంతో కేటీఆర్ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తన పర్యటనను కొనసాగించారు.అనంతరం కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్‌గా కరీంనగర్ వైపు బయలుదేరారు. దీంతో అలుగునూరు నుంచి కరీంనగర్ వరకు బీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.





























