- బీఆర్ఎస్ ఆందోళనలు ఆక్షేపణీయం.. రసమయి భూకబ్జాపై త్వరలో పోరాటం
- మెడికల్ కాలేజీ ఆరోపణలు నిరూపిస్తే రాసిస్తా: ఎమ్మెల్యే కవ్వంపల్లి
ప్రతిపక్షం, మానకొండూర్, సెప్టెంబర్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని ప్రజలు తిప్పికొట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేలా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టడం సరికాదన్నారు.శనివారం ఎల్ఎండీ కాలనీలోని అరుంధతీ ఫంక్షన్హాల్లో తిమ్మాపూర్, గన్నేరువరం మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డులు, ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదని కవ్వంపల్లి విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి హామీలను గత ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. కనీసం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రసమయికి ఎమ్మెల్యే సవాల్
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తనపై తరచూ ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని కవ్వంపల్లి అన్నారు. తాను రూ.350 కోట్లతో మెడికల్ కాలేజీ నడుపుతున్నానంటూ రసమయి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆ ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే ఆ మెడికల్ కాలేజీని రసమయికే రాసిస్తానని సవాల్ విసిరారు.
నీతులు చెప్పే రసమయి.. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులకు మించి ఆస్తులు ఎలా కూడబెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అటవీశాఖకు చెందిన ఐదు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించి కోళ్ల ఫారం నిర్మించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.అటవీశాఖ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కవ్వంపల్లి స్పష్టం చేశారు.
మూడు మండలాల్లో ఇళ్ల పరిస్థితి ఏంటి?
మానకొండూరు నియోజకవర్గంలోని మానకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం మండలాల్లో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీ ఎందుకు పూర్తి చేయలేకపోయారని రసమయిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల మంజూరు చేస్తుంటే విమర్శలు చేయడం తగదన్నారు.
గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం
రాష్ట్రంలో గుడిసెలు లేని తెలంగాణను నిర్మించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని కవ్వంపల్లి తెలిపారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇళ్ల మంజూరు చేస్తున్నామని చెప్పారు.పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో హౌసింగ్ పీడీతోపాటు తిమ్మాపూర్ ఎంపీడీవో ఎన్.రాజీవ్ మల్హోత్ర, తహసీల్దార్ కర్ర శ్రీనివాస్‌రెడ్డి, గన్నేరువరం ఎంపీవో వెంకట్‌రెడ్డి, సర్పంచ్ పొన్నాల సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, ప్యాక్స్ చైర్మన్లు గోపు మల్లారెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






























