[t4b-ticker]

నాలుగు నెలలుగా సెలవే లేదు.. వేధింపులు తాళలేక ఉద్యోగిని ఆత్మహత్య

ప్రతిపక్షం, ఆగస్టు 09: కర్ణాటకలోని మైసూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగంలో తీవ్రమైన పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది.

మైసూరుకు చెందిన నాగేశ్వరి ఓ సంస్థలో ఉత్పత్తుల ప్రచార ఉద్యోగిగా పనిచేస్తోంది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత 15 రోజులుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నాగేశ్వరి రాసిన లేఖలో.. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఉన్నతాధికారులు కావాలనే లక్ష్యంగా చేసుకుని వేధించారని పేర్కొన్నట్లు సమాచారం. నాలుగు నెలలుగా కనీసం ఒక్క వారపు సెలవు కూడా ఇవ్వలేదని, అత్యవసర పరిస్థితుల్లోనూ సెలవులు మంజూరు చేయలేదని ఆమె వాపోయినట్లు తెలుస్తోంది. కార్యాలయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

ఓ సూపర్‌వైజర్‌ వేధింపులే తన తీవ్ర నిర్ణయానికి కారణమని ఆమె లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో నాగేశ్వరి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఉద్యోగినిపై జరిగినట్లు ఆరోపిస్తున్న వేధింపులు, పని పరిస్థితులు, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News