- తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 22: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం సరికాదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు.“తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రధానమంత్రి చెబుతున్న వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. తెలంగాణ కూడా అందులో కీలక భాగస్వామిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతోంది” అని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ దేశ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, అంతర్జాతీయ సదస్సుల్లో రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, అన్ని వర్గాలను కలుపుకొని సమగ్ర అభివృద్ధి సాధించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణపై ప్రశ్నలు
రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అమెరికా, లండన్ పర్యటనలకు వెళ్లాలని భావించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు.తెలంగాణకు రావాల్సిన మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్లు తదితర కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ఆర్థిక సహకారం, నిధుల విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలన్నారు.చిన్నచిన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధానం కాకుండా, రాష్ట్రాల అభివృద్ధికి సహకరించే సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ బీజేపీ నాయకత్వానికి మంత్రి ప్రశ్నలు
తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.“తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కేంద్రం సహాయ నిరాకరణ చేస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా ప్రశ్నిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.పక్క రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదో కేంద్రం సమాధానం చెప్పాలని అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎంత ఆదాయం వెళ్తోంది, తిరిగి ఆయా రాష్ట్రాలకు ఎంత వస్తుందో కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసినప్పుడే తెలంగాణ రైజింగ్, వికసిత్ భారత్ లక్ష్యాలు సాకారం అవుతాయని మంత్రి పేర్కొన్నారు.
‘పల్లె పల్లెకు ప్రజాపాలన – పల్లె పల్లెకు పొన్నం’
తెలంగాణ ప్రజాపాలనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని 183 గ్రామాల్లో “పల్లె పల్లెకు ప్రజాపాలన – పల్లె పల్లెకు పొన్నం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ నెల 19వ తేదీ నుంచి ప్రతిరోజూ ఒక మండలంలోని ఐదు నుంచి ఆరు గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో నేరుగా సమావేశమవుతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం నాలుగో మండలంలో కొనసాగుతోందన్నారు.ప్రతి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని, వ్యవసాయం, ఆయిల్‌పామ్ సాగు,ప్రత్యామ్నాయ పంటలు, ఆరోగ్యం, విద్య, అంగన్‌వాడీ కేంద్రాలు, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రజల సమస్యలను కేవలం విని వదిలేయకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. మండలస్థాయి అధికారులను కూడా సమావేశాల్లో భాగస్వాములను చేయడం ద్వారా విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఏర్పడుతోందన్నారు.ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించడమే ప్రజాపాలన లక్ష్యమని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందించినా, నేరుగా చెప్పినా సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.“పల్లెకు ప్రభుత్వం రావాలి.. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి అందాలి. ఇదే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.





























