[t4b-ticker]

సీఎం రేవంత్‌పై విమర్శల వేళ.. పొంగులేటి మౌనంపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ

ప్రతిపక్షం, ఆగస్టు 21: తెలంగాణ రాజకీయాల్లో కొండా కుటుంబం వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మౌనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు స్పందిస్తున్నప్పటికీ.. పొంగులేటి మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పార్టీలో గుర్తింపు ఉంది. సీఎం లక్ష్యంగా విమర్శలు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి మద్దతుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. అయితే ప్రస్తుత వివాదంలో పొంగులేటి మౌనం పాటించడం వెనుక కారణమేంటన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు బహిరంగంగా స్పందిస్తూ పార్టీ క్రమశిక్షణను ప్రస్తావిస్తుండగా.. మరికొందరు నేతలు ఈ వ్యవహారంపై ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కీలకమైన మంత్రి పదవిలో ఉన్న పొంగులేటి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదే సమయంలో కాంగ్రెస్ వర్గాల్లో మరో రకమైన ప్రచారం కూడా జరుగుతోంది. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వ మార్పు వంటి పరిణామాలు చోటుచేసుకున్నా తనకు ఇబ్బంది లేకుండా పొంగులేటి ఆచితూచి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల్లో ఏ వర్గానికీ బహిరంగంగా మద్దతు ఇవ్వకుండా ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది.

అయితే పొంగులేటి మౌనం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఆయన స్వయంగా స్పందిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొండా కుటుంబం వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో పొంగులేటి ఈ అంశంపై స్పందిస్తారా? లేక ఇదే వైఖరిని కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News