ప్రతి పక్షం మర్రిగూడ, అక్టోబర్ 25: నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు.గ్రామంలోని ప్రధాన వీధులు, కూడళ్లలో కరపత్రాలను పంచుతూ, గోడలకు పోస్టర్లు అంటిస్తూ ఇంటింటా ప్రచారం చేశారు. మర్రిగూడ మండల రాష్ట్ర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామలింగా చారి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ కార్మికుల హక్కుల సాధన కోసం ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రైతు మహాసభల్లో రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, కౌలు రైతుల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. అందరూ సహకరించి ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు వెంకటయ్య, భూతరాజు వెంకటయ్య, గ్రామ రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.





























