ప్రతిపక్షం, ఆగస్టు 27: రక్షాబంధన్ సందర్భంగా కేటీఆర్‌కు రాఖీ కడతారా? అనే ప్రశ్నకు కవిత ఆసక్తికరంగా స్పందించారు. అన్న కేటీఆర్‌ను కలిసేందుకు ఈసారి వెళ్తున్నారా అని ఓ విలేకరి అడగ్గా.. గతంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ ఆమె సమాధానం ఇచ్చారు.
‘‘పోయినసారి అడిగినప్పుడు పట్నంలో లేకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు విదేశాలకు వెళ్లిపోయారు. మాకు కూడా ఆత్మగౌరవం, రోషం ఉంటుందిగా’’ అని కవిత వ్యాఖ్యానించారు. అన్నాచెల్లెళ్ల మధ్య రాఖీ పండుగకు ఉండే అనుబంధంపై అడిగిన ప్రశ్నకు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కేటీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈసారి రక్షాబంధన్ సందర్భంగా ఇద్దరూ కలిసే అవకాశం లేదన్న సంకేతాలు కవిత వ్యాఖ్యల ద్వారా కనిపిస్తున్నాయి. గతంలో రాఖీ సందర్భంగా ఎదురైన పరిస్థితులను ప్రస్తావించిన ఆమె.. తన ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇటీవల కవిత, కేటీఆర్ మధ్య రాజకీయంగా విభేదాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాఖీ పండుగ వేళ కవిత చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కుటుంబ బంధానికి సంబంధించిన అంశంలోనూ రాజకీయ పరిణామాల ప్రభావం కనిపిస్తోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.





























