ప్రతిపక్షం, ఆగస్టు 27: నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు అందిన సమాచారం ప్రకారం వరదల కారణంగా 165 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 826 మంది ఆచూకీ తెలియడం లేదని ప్రభుత్వం వెల్లడించింది. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వరదల ప్రభావం నేపాల్‌తో పాటు సరిహద్దు ప్రాంతాల్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. టిబెట్‌లోని గిరాంగ్ ప్రాంతంలో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల ఆచూకీ కూడా తెలియడం లేదని సమాచారం. వారిని గుర్తించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు మానస సరోవర్ యాత్రకు వెళ్లిన బృందానికి సంబంధించి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాము క్షేమంగా ఉన్నామని డీఆర్‌డీవో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆయనతో పాటు యాత్రలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కొంత ఊరట లభించింది.
నేపాల్‌లో వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు, రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో గల్లంతైన వారి ఆచూకీ గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారతీయుల పరిస్థితిపై భారత ప్రభుత్వం కూడా నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తోంది.
భారీగా ప్రాణనష్టం, గల్లంతైన వారి సంఖ్య పెరుగుతుండటంతో నేపాల్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించి వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేస్తున్నారు.





























