ప్రతిపక్షం, ఆగస్టు 27: రాఖీ పండుగ రోజున ఓ అక్క తన తమ్ముడికి ఇచ్చిన బహుమతి అందరి హృదయాలను కదిలిస్తోంది. గ్రేటర్ నోయిడాకు చెందిన జితేంద్ర రెండున్నరేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నారు. తమ్ముడి పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన అక్క బీనా.. చివరకు తన కిడ్నీని దానం చేసి అతడికి కొత్త జీవితాన్ని అందించారు.
చిన్నప్పటి నుంచి తనతో ఎంతో అనుబంధంగా ఉన్న తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని బీనా తట్టుకోలేకపోయారు. వైద్యుల సూచనలు, కుటుంబ సభ్యుల సమ్మతితో తన కిడ్నీని తమ్ముడికి దానం చేసేందుకు ముందుకొచ్చారు. రాఖీ పండుగ సందర్భంగా జరిగిన ఈ ఘటన అన్నాచెల్లెళ్ల అనుబంధానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది.
కిడ్నీ మార్పిడి అనంతరం జితేంద్ర ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో పోరాడుతున్న తమ్ముడికి తన వంతుగా జీవితాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని బీనా పేర్కొన్నారు.
‘ఇది త్యాగం కాదు.. అక్కగా నా బాధ్యత’ అంటూ బీనా చెప్పిన మాటలు కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురిచేశాయి. రాఖీ కట్టి తమ్ముడి క్షేమాన్ని కోరుకునే అక్క.. అదే రోజున తన కిడ్నీని దానం చేసి అతడికి కొత్త జీవితం ఇవ్వడం నిజమైన సోదర ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.
తనకు ప్రాణం పోసిన అక్క రుణాన్ని ఏ జన్మలోనూ తీర్చుకోలేనంటూ జితేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచి జీవితాన్ని తిరిగి అందించిన బీనాకు జీవితాంతం రుణపడి ఉంటానని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు బీనా గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు.





























