ప్రతిపక్షం, ఆగస్టు 27: మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, హరీశ్‌రావుతో లండన్‌లో ఎలాంటి ఒప్పందం జరగలేదని నిరూపించేందుకు ఆయనపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని హరీశ్‌రావు తన సొంత డెయిరీకి ప్రయోజనం చేకూర్చుకున్నారని కవిత ఆరోపించారు. ప్రభుత్వ రంగ డెయిరీని కాదని సొంత డెయిరీ ద్వారా కార్పొరేట్ కళాశాలలు, సంస్థలు, ఆసుపత్రులకు పాలు సరఫరా చేస్తూ ఎనిమిదేళ్లలో వందల కోట్ల రూపాయల వ్యాపారం చేశారని పేర్కొన్నారు. అధికారాన్ని ఉపయోగించి వ్యక్తిగత వ్యాపారానికి ప్రయోజనం కల్పించడం క్విడ్ ప్రో కో కాదా? అని ప్రశ్నించారు.
హరీశ్‌రావుతో ప్రభుత్వానికి ఎలాంటి లాలూచీ లేదంటే వెంటనే చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. 500 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రతి విద్యాసంస్థకు ప్రైవేటు డెయిరీల నుంచి కాకుండా ప్రభుత్వ లేదా సహకార సంఘాల ఆధ్వర్యంలోని డెయిరీల నుంచే పాలు సరఫరా చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
తాను చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కవిత అన్నారు. ప్రభుత్వ రంగ డెయిరీలకు ప్రాధాన్యం కల్పించడంతో పాటు గతంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.





























