జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీశ్‌రావు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సిద్ధిపేట జిల్లా ప్రజలకు, ఆడపడుచులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెత్తర అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు ప్రకృతి ఆరాధనతో, ఆడబిడ్డల ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతుందని అన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు. మహిళల ఐక్యతకు, కుటుంబ అనుబంధాలకు, ఆత్మీయతకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.
బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, సామాజిక ఐక్యతకు ప్రతిబింబమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపు కల్పించిందన్నారు. దీని ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.ఒకప్పుడు తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ వేడుకలు నేడు దేశవిదేశాల్లో ఘనంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డలు తమ మూలాలను, సంస్కృతిని మరచి పోకుండా బతుకమ్మ పండుగను జరుపుకోవడం గర్వకారణమన్నారు. విదేశాల్లోనూ బతుకమ్మ పాటలు మారు మోగడం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని చెప్పారు. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.





























