సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలి!

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మెదక్ బస్ డిపో నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ

ఎఫ్ఆర్ఎస్, కేంద్రీకృత సరుకుల కొనుగోలు విధానాన్ని రద్దు చేయాలి –ఎస్ఎఫ్ఐ డిమాండ్

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, నవంబర్ 26: సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ మెదక్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఉధృతమైంది. మూడు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన విద్యార్థులు గురువారం మెదక్ బస్ డిపో నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌కు చేరుకుని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు కిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలకడం అభినందనీయమన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లో, సరైన మౌలిక సదుపాయాలు లేకుండా కొనసాగుతున్నాయని, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సరిపడా వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎఫ్ఆర్ఎస్ విధానం పేరుతో విద్యార్థులకు ఇబ్బందులు కలిగించకుండా, వారి విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రీకృత సరుకుల కొనుగోలు విధానం వల్ల వసతి గృహాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు.సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందులకు గురిచేసే విధానాలను అమలు చేయడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మెదక్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సిద్ధు, రాకేష్, నాయకులు రాజకుమార్, కార్తీక్, గణేష్, చరణ్, హరికృష్ణ, ముకేష్, నవీన్, అనిల్, విజయ్, వినయ్, నాగమణి, కిరణ్, అనుష్క, నందిని, శ్రీవల్లి, ప్రసన్న, లక్ష్మీ, సౌమ్య, జస్నవి, అవంతి, స్పందన, నక్షత్ర, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News