ప్రతిపక్షం, ఆగస్టు 28, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అనంతరం సోదరుడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే మంత్రి సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారి సోదరీమణులు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ఆత్మీయంగా వేడుకలు జరుపుకున్నారు. రాఖీలు కట్టించుకున్న అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఆయన సోదరులు అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సోదర, సోదరీమణుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే పండుగగా రక్షాబంధన్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత వెల్లివిరిసేలా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.































