ప్రతిపక్షం, ఆగస్టు 28: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ విస్తృత ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ప్రజలకు వివరించాలని పార్టీ నిర్ణయించింది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, మొత్తం 420 హామీల అమలు తీరును ప్రజల ముందుంచాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీల్లో చాలా వరకు నెరవేరలేదని ఆరోపిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేకంగా రూపొందించిన ఆరోపణ పత్రాన్ని విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 2న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ ధర్నాలు నిర్వహించనున్నారు. 420 హామీలను గుర్తుచేస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుచేసే విధంగా ఇంటింటికీ ‘బాకీ కార్డులు’ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
సెప్టెంబర్ 3న వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా రైతు సదస్సులు నిర్వహించనున్నారు. సాగునీరు, విద్యుత్, యూరియా, రైతు బీమా తదితర అంశాలపై రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యపైనా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 4న మహిళలు, దివ్యాంగులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ కొన్ని ప్రాంతాల్లో వంటావార్పు కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 5న విద్యార్థులు, యువత సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్, యువతకు ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ నిర్ణయించింది. ఆదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలు తదితర సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, స్థానిక సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 7న ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యాలను ప్రస్తావిస్తూ వినతిపత్రాలు సమర్పించనున్నారు. 420 హామీల అమలుపై జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సెప్టెంబర్ 8న వారం రోజుల పాటు నిర్వహించిన పోరాట కార్యక్రమాలను వివరించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.
అదే విధంగా సెప్టెంబర్ 10న ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు చేపట్టే నిరసన కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ సంఘీభావం ప్రకటించనుంది. ఇలా వారం రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, హామీల అమలు, ప్రజా సమస్యలపై విస్తృత స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే నెరవేరని హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ఎక్కువగా ఉన్నాయని ప్రజలకు వివరించడమే ఈ పోరుబాట ప్రధాన ఉద్దేశమని పార్టీ నేతలు చెబుతున్నారు.





























