Trending Now

రామేశ్వరం బ్రహ్మోత్సవాలలో భారీ పోలీసు బందోబస్తు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో విరసిల్లుతున్న మహిమానిత్వమైన శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దర్శనం కోసం ఆలయ సిబ్బంది ఘనంగా ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అభిషేక పూజాది కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. భక్తుల సంరక్షణ కొసం ఇక్కడ షాద్ నగర్ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం నేతృత్వంలో ఇద్దరు సిఐలు, 5 మంది ఎస్ఐలు, 7 మంది ఏఎస్సైలు, 100 మంది సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, చరిత దంపతులు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు రమాదేవి ఇతర భక్తులు దర్శించుకున్నారు.

ఇది ఆలయ మహత్యం..

సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి అన్నాడు. 24వేల శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. అంతటి ఆ భగవత్ స్వరూపుడు ఆ శ్రీరామ చంద్రుడే స్వయంగా తన స్వహస్తంతో శివ లింగాన్ని ప్రతిష్టించిన చరిత్ర శ్రీశ్రీశ్రీ రామ లింగేశ్వర స్వామి (రామేశ్వరం) దేవాలయానిది అంటే అతిశయోక్తి కాదేమో. సీతాన్వేషణలో భాగంగా ఆ శ్రీరాముడు ఈ దండకారణ్యంలో అన్వేషణ సాగుతున్నప్పుడు ఇచ్చోటనే మహిమాన్వితమైన శివలింగాన్ని ప్రతిష్టించారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో వెలిసిన ఈ అద్భుతమైన, అద్వితీయమైన
చరిత్రను ఓసారి నెమరువేసుకుందాం.! ఈ దేవాలయము ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని రాయికల్ గ్రామ శివారులో గల పంచముఖ గుట్ట సమీపంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వరుడిని స్వయంగా ఆ శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని మాణిక్య ప్రభు చరిత్రలో వ్రాయబడి ఉంది.

శివ లింగాన్ని శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడనటానికి నిదర్శనంగా శివలింగంపై రామబాణం గుర్తు ఉంది. శ్రీరాముడు సీతాన్వేషణకు లంకకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలో బదిరీ వృక్షం క్రింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసారని భక్తుల విశ్వాసం. ప్రకృతి వైపరీత్యాల వల్ల రాముడు ప్రతిష్ఠించిన శివలింగం చాలా కాలం పాటు భూగర్భంలోనే ఉండిందని చరిత్ర చెబుతుంది.

రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభువు శిష్యుడగు నరసింహారాయులు అనే భక్తుడు తపస్సు చేస్తుండే వాడు, ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శన మిచ్చి బదిరీ వృక్షం క్రింద శివలింగం ఉందనీ, దాన్ని బయటకు తీసి పూజలు చేయాలని ఆజ్ఞాపించాడు. ఆ భక్తుడు శివలింగాన్ని వెలికి తీసి పూజలు నిర్వహించాడు. అనంతరం నరసింహారాయల శిష్యుడగు అప్పకొండ భట్టు అనే భక్తుడు శివలింగానికి నిత్య పూజలు చేస్తూ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని, కోనేరును నిర్మించి రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేసినట్లుగా చెబుతారు. ఆలయంలో గల శివలింగం ప్రతి యేటా కొంత పరిమాణం పెరుగుతుంది.

Spread the love