ప్రతిపక్షం, ఆగస్టు 22: తనపై అసభ్యకరంగా దూషించడంతో పాటు అకారణంగా దాడి చేసి పరువుకు భంగం కలిగించారని జానపద నృత్య కళాకారిణి మాధురి రాథోడ్ ఆరోపించారు. ఈ నెల 19న తోటి నృత్య కళాకారుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన ఐఫోన్‌ను తీసుకెళ్లారని ఆరోపిస్తూ మాధురి వేములవాడ పోలీసులను ఆశ్రయించారు.
తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
మాధురి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శరణ్యతో పాటు సంబంధిత మీడియా సంస్థలపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ పోలీస్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఘటనకు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా వేదికల్లో జరిగిన ప్రచారం, దాడి ఆరోపణలు, ఫోన్ తీసుకెళ్లిన ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.





















