ప్రతిపక్షం, ఆగస్టు 22: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ లాంచింగ్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపికపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు అగ్నిపరీక్ష సీజన్ 2 నిర్వహిస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఫైనలైజ్ చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ విలన్ టెంపర్ వంశీ పేరు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమాలో ప్రకాశ్‌రాజ్ తమ్ముడి పాత్రలో ప్రతినాయకుడిగా నటించిన వంశీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది, భరత్ అనే నేను, సాహో, భీష్మ, వకీల్ సాబ్, హిట్ 2, దేవర వంటి పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ ఏడాది పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్‌తో పాటు వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రంలోనూ వంశీ నటించినట్లు సమాచారం. వెండితెరపై ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించిన ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే ఎలా ఉంటారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. బిగ్‌బాస్ టాస్కుల్లో ఆయన ప్రదర్శన, ఇతర కంటెస్టెంట్లతో వ్యవహరించే తీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు సినిమా ఈవెంట్లకు యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఛర్మిల కూడా బిగ్‌బాస్ 10లోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించినట్లు సమాచారం. ఇక ఈసారి కంటెస్టెంట్ల జాబితాలో పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పేర్లలో ఎవరెవరు నిజంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టెంపర్ వంశీ పేరు మాత్రం ప్రస్తుతం బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్‌గా బాగా ప్రచారంలో ఉంది.
























