26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

ప్రతిపక్షం, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించి, అచ్చంపేట వేదికగా రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు పండుగ వాతావరణంలో చీరలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

వాస్తవానికి ఈ నెల 19వ తేదీనే సిద్దిపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ఈ నెల 26న అచ్చంపేటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65 లక్షల మంది మహిళలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే 35 లక్షల మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఈ పంపిణీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చిలకపచ్చ రంగు చీరలను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన మహిళలకు చీరలు అందించేలా పంపిణీ ప్రక్రియను చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి అచ్చంపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కొనసాగనుంది. కోటి మంది మహిళలకు చీరలు అందించే ఈ కార్యక్రమం అమలు, పంపిణీ ఏర్పాట్లు ఎలా సాగుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related News

Latest News