చేయూత కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు
ప్రతిపక్షం, సెప్టెంబర్ 24, హైదరాబాద్: చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇప్పటివరకు సెప్టెంబర్ 25 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ SERP సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫీల్డ్ స్థాయి అధికారులు SIR విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లు, ఇతర బాధ్యతల్లో నిమగ్నమై ఉండటంతో నిర్ణీత గడువులో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయలేకపోతున్నామని వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు చేయూత కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలనను పొడిగించిన గడువులోగా పూర్తిచేయాలని SERP ఆదేశించింది.
దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అర్హత కలిగిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.





























