ప్రతిపక్షం, జూలై 13: ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి ప్రస్తుతం పూర్తిగా తెరిచి ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రయాణించే వాణిజ్య, సరుకు రవాణా నౌకలు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ మార్గాన్ని వినియోగించవచ్చని స్పష్టం చేసింది.
హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గమని పేర్కొన్న అమెరికా, ఈ ప్రాంతంలో నౌకల భద్రత కోసం తమ నౌకాదళం పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించింది. ఇరాన్ నుంచి తలెత్తే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని హామీ ఇచ్చింది.
హార్ముజ్ జలసంధిపై ఏకపక్ష నియంత్రణ చెలాయించే హక్కు ఇరాన్‌కు లేదని అమెరికా స్పష్టం చేసింది. అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను కాపాడేందుకు అవసరమైన చర్యలు కొనసాగిస్తామని తెలిపింది.
ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వ్యవహారం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గంలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

















