కేసీఆర్ చెప్పిందే రేవంత్ చెప్పారు.. ఇప్పుడు విమర్శలు ఎందుకు?: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 08: బీఆర్ఎస్ నేతలు ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని, మూసీ అభివృద్ధి వద్దంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విచిత్రమని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్తుపై స్పష్టత లేని ప్రతిపక్షాన్ని తాను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. కేవలం వార్తల్లో నిలవడానికే మాజీ మంత్రి టి. హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం వాస్తవాలకు దూరమని అన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయంలో సగం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

హైడ్రా అంశంపై స్పందిస్తూ, గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా కఠిన చర్యల గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తుచేశారు. అప్పట్లో స్పందించని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు సీఎం ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు.

హైదరాబాద్‌కు అదనపు తాగునీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించిన యెన్నం, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News