Trending Now

ఎన్నికల వేళ రౌడీషీటర్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: లోక్​సభ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాగతం కలుగకుండా పోలీసులు రౌడీషీటర్లు, పాతనేరస్తులపై ప్రత్యేక దృష్టిసారించారు. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉండడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తుగా రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, కమ్యూనల్ అఫెండర్స్‌పై నిఘా పెట్టారు. నేరాలకు పాల్పడకుండా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ల కదలికలపై ఆరా తీస్తున్నారు.

త్రీ కమీషనరేట్ల పరిధిలో..

ముఖ్యంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలు చేయోద్దంటూ వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. కొన్ని కేసుల్లో కనిపించకుండా పోయిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరికొంతమంది ఇంటికి నేరుగా వెళ్లి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది పాత నేరస్థులు పోలీసుల హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా పలువురిని బెదిరించినట్లు గుర్తించిన పోలీసులు వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో శాంతి భధ్రతల సమస్యలను లేవదీస్తారనే అనుమానం ఉన్న వాళ్లను బైండోవర్ చేస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 3వేల 5వందల మంది రౌడీషీటర్లు రికార్డుల్లో నమోదయ్యారు. వీరితో పాటు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్లపైనా పోలీసులు నిఘా పెట్టారు.

హైదరాబాద్ మహానగరంతోపాటు సిటీ శివారు ప్రాంతాల్లో ప్రైవేటు దందాలు, రియల్‌ ఎస్టేట్ వ్యాపారం, హోటళ్లు, హవాలా, హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్న ఏ వన్‌ రౌడీ షీటర్లు వెయ్యి మంది వరకు ఉన్నట్టు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అయా పోలీస్ స్టేషన్ల ఇన్‌‌స్పెక్టర్లను ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రౌడీ షీటర్ల బైండోవర్‌ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ జోన్, సౌత్ ఈస్ట్, వెస్ట్ జోన్ పరిధిలో ఎక్కువ మంది రౌడీషీటర్లు ఉన్నట్లు రికార్డు చెబుతున్నాయి. పోలీస్ స్టేషన్ల వారీగా వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏసీపీ, ఇన్స్‌పెక్టర్లకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలిచ్చారు. కొంతమందిని రౌడీషీటర్లను తహసీల్దార్, ఆర్డీవోల వద్ద బైండోవర్ చేయాలని సూచించారు.

Spread the love