Trending Now

దేవుళ్లంటే మీకు అంత చులకనా..?

కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్

ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 22: ఎన్నికల హామీలను అమలు చేయకుండా మళ్లీ దేవుడి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తామంటూ డ్రామాలాడతారా..? దేవుళ్లంటే మీకు అంత చులకనా..? అని కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైరయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రైతులు, ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంగతి తేలుస్తరని.. తడిసిన వడ్లన్నీ కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రూ.2 లక్షల రుణమాఫీ డ్రామాలు.. పంట నష్టపోతే పరిహారం నేటికీ అందని దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

‘‘ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ మాదిరిగా తమకు పవిత్ర గ్రంథమని, అందులో పొందుపర్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పారు.. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద ప్రమాణం చేస్తున్నరు.. నేనడుగుతున్నా.. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు దేవుళ్లను, భగవద్గీత, బైబిల్, ఖరాన్ లను వాడుకుంటారా..? ఎన్నికలైపోంగనే వాటిని గాలికొదిలేస్తారా..? దేవుళ్లంటే మీకు అంత చులకనా?’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇవాళ ఉదయం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ వడ్ల కొనుగోలు కేందాన్ని సందర్శించి.. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఏకరవు పెట్టారు. ‘’సార్.. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నం. అధికారులు ఎంత చెప్పినా వడ్లలో కటింగ్ పెడుతున్నరు. వానొస్తే భయమైతుంది. టార్పాలిన్లు ఇవ్వడం లేదు. కనీస సౌకర్యాల్లేవు. తాలు, తరుగు పేరుతో ఇబ్బంది పెడుతున్నరు. ఇవన్నీ మీలాంటోళ్లకు చెబుదామంటే రైతులను ఇక్కడున్నోళ్లు భయపెడుతున్నారు. దీంతో రైతులెవరూ మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. రైతులే దేశానికి వెన్నుముక అంటరు.. రైతుల వెన్నుపూస ఇరగ్గొడుతున్నరు. రైతుల ఆవేదనను విన్ని బండి సంజయ్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఎన్నికల మేనిఫెస్టో తమకు బైబిల్, ఖరాన్, భగవద్గీత తో సమానమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మళ్లీ మోసం చేస్తున్నరు. నేనడుగుతున్న తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ కళ్ల ముందే మోసం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం కనీస మధ్దతు ధరను రెట్టింపు చేశారు. ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరాకు రూ.20 వేల దాకా రైతులపై భారం తగ్గిస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సబ్సిడీలన్నీ ఎత్తేసే ప్రమాదం ఉంది. కనీస మద్దతు ధర చెల్లించే పరిస్థితి కూడా ఉండదు. తద్వారా రైతులపై విపరీతమైన భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతాంగం వాస్తవాలు ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Spread the love

Related News